మాలీవుడ్ సూపర్ స్టార్ టూ సెంట్రల్ మినిష్టర్

- June 26, 2024 , by Maagulf
మాలీవుడ్ సూపర్ స్టార్ టూ సెంట్రల్ మినిష్టర్

సురేష్ గోపి.. భారత దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. మలయాళ చలనచిత్ర పరిశ్రమలో బాల నటుడిగా అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదగడమే కాకుండా అక్కడి దిగ్గజ నటులైన మోహన్ లాల్, మమ్ముట్టిల సరసన నిలిచారు. ఆయన నటించిన పలు సినిమాలు బహుళ భాషల్లో విడుదలై సంచలన విజయాలు సాధించాయి.తన తరం నటులకు సాధ్యం కానీ అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఏకైక నటుడిగా సురేష్ నిలిచారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగారు.నేడు మాలీవుడ్ సూపర్ స్టార్, కేంద్ర మంత్రి సురేష్ గోపి జన్మదినం.

సురేష్ గోపి పూర్తి పేరు సురేష్ గోపీ నాథన్ నాయర్. 1958, జూన్ 26 కేరళలోని అలప్పుజ్హ పట్టణంలో ప్రముఖ మలయాళ సినిమా డిస్ట్రిబ్యూటర్ కె. గోపీనాథన్ పిళ్ళై, జ్ఞానలక్ష్మి అమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో వారి కుటుంబం కేరళలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉండేది. అయితే, సురేష్ చిన్నతనంలోనే తమ సొంతూరైన కొల్లాం పట్టణంలో స్థిరపడింది. కొల్లాంలోని ప్రముఖ కళాశాల ఫాతిమా మాత జాతీయ కళాశాలలో బీఎస్సి  జువాలజీ,  ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

సురేష్ గోపి తండ్రి  సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో 1956లో వచ్చిన "ఒడియల్ నిన్ను" అనే మలయాళ చిత్రంలో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రానికి జాతీయ అవార్డు సైతం లభించింది. ఆ చిత్రం తర్వాత బాల నటుడిగా పలు అవకాశాలు వచ్చినప్పటికీ చదువు మీద దృష్టి మరలుతుంది అనే మిషతో ఆయన తండ్రి సినిమాల్లో నటించనీయలేదు. కళాశాలలో చదివే రోజుల్లో మాత్రం జయన్, ప్రేమ్ నజీర్, కమల్ హాసన్ చిత్రాలు చూడటం ద్వారా నటన పట్ల ఆసక్తి ఏర్పడింది.

సినిమాల మీద ఆసక్తి ఉన్నప్పటికీ  ఆయన తండ్రికి ఇష్టం లేకపోవడం వల్ల మొదట అవకాశాల కోసం ప్రయత్నాలు చేయలేదు. ఇదే సమయంలో సురేష్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారు, సివిల్స్ రెండు సార్లు రాస్తే మెయిన్స్ వరకు వెళ్లడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల సివిల్స్ ప్రిపరేషన్ మధ్యలోనే ఆపేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే సినిమాల పట్ల తిరిగి ఆసక్తి మొదలు కావడంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ 1986లో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన యువజనోత్సవం అనే మలయాళ చిత్రంలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే అప్పటి యువ కథానాయకులైన మోహన్ లాల్, మమ్ముట్టి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

1987 నుండి 1990ల వరకు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, గెస్ట్ అప్పియరెన్స్ మరియు సెకండ్ హీరో ఇలా అవకాశం వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ నటుడిగా సురేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఈ దశలోనే సురేష్ గోపీనాథన్ పేరు కాస్త సురేష్ గోపిగా మారింది. 1980 చివర్లో ముఖ్యంగా మోహన్ లాల్, మమ్ముట్టి చిత్రాల్లో విలన్ గా సురేష్ గోపి నటిస్తే సినిమా హిట్టు అనే స్థాయికి మలయాళ చిత్ర సీమలో పేరు సంపాదించుకున్నారు. ఇదే సమయంలో సురేష్ గోపిని హీరోగా పెట్టి  చిన్న సినిమాలు చేయడానికి దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతూ వచ్చారు.

1990మొదట్లో సురేష్ విలన్ రోల్స్ తగ్గించి క్యారెక్టర్ రోల్స్, హీరోగా ఎక్కువ సినిమాలు చేసేవాడు. 1992లో విద్యార్ధి రాజకీయాల ఆధారంగా తీసిన యాక్షన్ డ్రామా తలస్థానం చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా సురేష్ గోపిని పూర్తి స్థాయి హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. 1993లో తన మిత్రుడైన షాజీ కైలాస్ దర్శకత్వంలో నటించిన ఏకాలవ్యాన్, మాఫియా చిత్రాలు యాక్షన్ హీరోగా నిలబెట్టాయి. ఈ రెండు చిత్రాల్లో సురేష్ పలికిన హై వోల్టేజ్ డైలాగులకు కేరళ యూత్ ఫిదా అయిపోయారు. 1993 చివరి నాటికి అప్పటి సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలకు సమాంతరంగా ఎదుగుతూ యాక్షన్ జోనర్లో సినిమాలు తీసే దర్శకులకు, నిర్మాతలకు సురేష్ మంచి ఛాయిస్ అయ్యాడు.

1994లో షాజీ దర్శకత్వంలో నటించిన "కమీషనర్" చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఈ చిత్రంలో సురేష్ గోపి  భరత్ చంద్రన్ ఐపీస్ పాత్రలో నటించి నీతి, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉంటారు అనే స్థాయిలో నటించి ఆడియన్స్ ను మెప్పించారు. మలయాళ చలన చిత్ర పరిశ్రమలో కమీషనర్ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో డబ్ చేయగా అక్కడ కూడా సంచలన విజయం సాధించి సురేష్ గోపికి పాన్ ఇండియా మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చిరంజీవి, బాలకృష్ణలు సైతం దక్కని వసూళ్ళు ఈ చిత్రానికి దక్కడం అప్పట్లో ఒక సంచనలం. ఈ ఒక్క చిత్రం సురేష్ గోపిని మోహన్ లాల్, మమ్ముట్టి సరసన నిలిపింది.

కమీషనర్ తర్వాత సురేష్ గోపి నటించిన చిత్రాలు మలయాళంలో అటుఇటుగా ఆడినా తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం ఘనవిజయాలు నమోదు చేసి తన నటులను, దర్శక నిర్మాతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసేవి. మలయాళ చలన చిత్ర పరిశ్రమలో మొదటి పాన్ ఇండియా హీరోగా, యాక్షన్ సూపర్ స్టార్ గా సురేష్ తన కెరీర్ లో ఉచ్చ స్థితికి చేరుకున్నాడు. ఆ రోజుల్లో మోహన్ లాల్, మమ్ముట్టి చిత్రాలకు కలిపి వచ్చే కలెక్షన్లు సురేష్ గోపి చిత్రాలకు వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. సురేష్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి తన పాత చిత్రాలను సైతం డబ్ చేసి విడుదల చేస్తే అవి సంచలన విజయాలు సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి.

1996 నుండి 2000 వరకు సురేష్ గోపి నటించిన చిత్రాలలో చాలా వరకు సూపర్ డూపర్ హిట్స్ నిలిచాయి. ముఖ్యంగా యాక్షన్ చిత్రాలైతే చెప్పాల్సిన పనిలేదు. సురేష్ గోపి డబ్బింగ్ యాక్షన్ చిత్రాల మానియా కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువత తెలుగు చిత్రాలకు రావడం లేదని గ్రహించి అతని సినిమాలపై నిషేధం విధించాలని సినీపెద్దలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరడంతో సురేష్ గోపి చిత్రాలపై 1997మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ళు  నిషేధం విధించింది. ఇది ఒక రకంగా సురేష్ గోపి మార్కెట్ దెబ్బతినడంతో కీలకం.

2001 నుండి 2005 వరకు సురేష్ గోపి నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు చవిచూశాయి. 2005లో తన మిత్రుడైన రెంజీ పణిక్కర్ దర్శకత్వంలో వచ్చిన "భరత్ చంద్రన్ ఐపీస్" ఘన విజయం సాధించడంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆతర్వాత సురేష్ నటించిన పలు చిత్రాలు హిట్స్,ఫ్లాప్స్ సంబంధం లేకుండా తన అభిమానులను, ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల ఆయన నటించిన పప్పన్, కావల్, గరుడన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించడమే కాకుండా నటుడిగా ఆయన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేశాయి.

సురేష్ గోపి నటుడిగానే కాకుండా సింగర్ గా సైతం రాణించారు. నటుడిగా సినిమాలు ఫ్లాప్స్ అవుతున్న సమయంలో సింగర్ గా తాను పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ మార్కెట్ లో సంచలనం సృష్టించాయి. సురేష్ అడుగుజాల్లోనే మోహన్ లాల్ సైతం సింగర్ గా అవతారం ఎత్తి  ప్రైవేట్ ఆల్బమ్స్ విడుదల చేస్తున్నారు. అలాగే, సురేష్  "మీలో ఎవరు కోటీశ్వరుడు" ప్రోగ్రామ్ మలయాళ వర్షన్ హోస్ట్ గా సైతం మెప్పించారు.  

సురేష్ గోపి చదువుకునే రోజుల్లోనే విద్యార్ధి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. వామపక్ష విద్యార్ధి విభాగం ఎస్.ఎఫ్.ఐ లో పనిచేశారు . విద్యార్థిగా ఉన్న సమయంలో వామపక్ష దిగ్గజాలు,కేరళ మాజీ ముఖ్యమంత్రులైన స్వర్గీయ ఈ.కె.నయనార్,  అచ్యుతానందన్ లు ఆరాధ్య నేతలు . అనంతర కాలంలో ఇందిరా గాంధీ పట్ల అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ సీఎం కరుణాకరన్ ద్వారా సురేష్ సోనియా గాంధీకి దగ్గరయ్యారు. హీరోగా ఎంత బిజీగా ఉన్నా ఈ రెండు పార్టీలకు నేతలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు బీజేపీ పార్టీలో చేరారు.

2016లో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా సురేష్ గోపి తన ఎంపీ లాడ్స్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆదివాసీ ప్రాంతాల్లో త్రాగునీటి వసతి, పీఎం ఆవాస్ యోజన కింద అర్హులైన పేదలకు ఇళ్లను ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా కేరళ వరదలు, కరోనా సమయాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్లమెంట్ వేదికగా కేరళ ప్రజల సమస్యలపై గళం విప్పారు.

ప్రధాని మోడీ  ఆదేశాల మేరకు 2019 లోక్ సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుండి పోటీ చేసి పరాజయం చవిచూసినా, 2024లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి చరిత్ర సృష్టించారు. కేరళ నుండి బీజేపీ తరపున ఎన్నికైన తోలి ఎంపీగా రికార్డులుకెక్కారు. ఎంపీగా ఎన్నికవ్వడమే కాకుండా మోడీ 3.0 మంత్రివర్గంలో టూరిజం, పెట్రోలియం&సహజవాయువు శాఖల కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


సురేష్ గోపి వ్యక్తిగత జీవితానికి వస్తే సురేష్ భార్య రాధికా నాయర్ సింగర్ మరియు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోపి పెద్ద కుమారుడు గోకుల్ సురేష్ మలయాళ చలన చిత్ర పరిశ్రమలో యువ కథానాయకుడిగా రాణిస్తున్నాడు. చిన్న కుమారుడు మాధవ్ సురేష్ సైతం సినిమాల్లో నటిస్తున్నాడు.1999లో కాళీ యాట్టమ్ అనే చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం అందుకున్నారు.    

జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన సురేష్ గోపి, ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం కలిగిన వ్యక్తి. కెరీర్ మొదట్లో ఎలా ఉన్నాడో, ఇప్పటికి అలాగే ఉన్నాడు అని అతని సహచర నటులు, సన్నిహితులు చెబుతారు. ప్రస్తుతం సురేష్ గోపి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన 250వ చిత్రం "వరాహామ్" చిత్రంలో నటిస్తున్నాడు.    


--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com