ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూలిన రూఫ్..ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు

- June 28, 2024 , by Maagulf
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూలిన రూఫ్..ఒకరి మృతి.. ఆరుగురికి గాయాలు

న్యూ ఢిల్లీ: భారీ వర్షాల వల్ల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూఫ్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సహాయ బృందాలు చర్యలు చేపట్టాయని అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి వైద్య సాయం అందించామని చెప్పారు.

టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు అన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సహాయక సిబ్బంది సైట్‌లో పని చేస్తున్నారని తెలిపారు.

ఢిల్లీలో తెల్లవారు జామునుంచి ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.

ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి. కొన్ని వారాలుగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని వివిధ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో నీటి ఎద్దడి సమస్య తీరుతుందని భావిస్తున్నారు.

కాగా, ధౌలా కువాన్ ఫ్లైఓవర్ కింద నీరు చేరిన కారణంగా నరైనా నుంచి మోతీ బాగ్ వైపు వెళ్లే రెండు క్యారేజ్‌వేలలో రింగ్ రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి వేరే మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లాల్సిన వారు వర్షంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com