రాజకీయ మేధావి-పి.వి

- June 28, 2024 , by Maagulf
రాజకీయ మేధావి-పి.వి

పాములపర్తి వేంకట నరసింహారావు.. భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి తెలుగువాడు. భారతదేశ రాజకీయ చరిత్రలో మెరునగధీరుడు...తెలంగాణ పల్లెలో పుట్టి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రాజకీయ దురంధరుడు... బాహుభాష కోవిదుడు, తెలంగాణ ముద్దు బిడ్డ పి.వి. నరసింహారావు, 10వ ప్రధానమంత్రిగా, మన భారతదేశంలో ఎన్నో సరళీకృత ఆర్ధిక విధానాలు ప్రవేశ పెట్టి, దేశ ప్రగతికి కొత్త బాటలు వేసిన అసమాన ప్రజ్ఞావంతులు మన పివీ. అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. నేడు పి.వి. నరసింహారావు జయంతి.

తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు  పి.వి జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు.

1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతనును బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు న్యాయశాస్త్రం చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు.

బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసారు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవారు. బహుభాషలు నేర్చి తన బాషా పాండిత్యాన్ని సాహిత్యం మీద ప్రయోగించారు.

కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది . తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.

1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పివి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని రాజకీయ నేపథ్యం ఆయన్ని 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన జై ఆంధ్ర ఉద్యమం, భూ సంస్కరణల కారణంగా రాజీనామా చేశారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలలో పనిచేశారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో పీవీ మాత్రమే ఆ పదవికి సరైన దిక్కయ్యారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది.

ప్రధానమంత్రిగా పి.వి అపూర్వ, మహత్తర ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశానికి విపరీత ఆర్ధిక సంభం నుంచి విముక్తి కల్గించారు; రాజకీయ సుస్థిరత్వంతో, పరిపాలనా దక్షతతో పి.వి స్వతంత్ర భారతాన్ని అభివృద్ధి పధంలో పురోగమింప చేసారు. పి.వి ఆర్ధిక సంస్కరణలకు ఇంతవరకు ప్రత్యామ్నాయ సంస్కరణలు రాలేదన్నది గమనార్హ విషయం. పి.వి పాలనలోనె స్వతంత్ర భారతదేశం ఆత్మవిశ్వాసంతో నూతన శతాబ్దంలో అడుగుపెట్టింది. దేశానికి పివి చేసిన సేవలకు గాను ఆయన్ని మోడీ సర్కార్ "భారత రత్న" తో గౌరవించింది.

పి.వి పలు భారతదేశ భాషలలో, విదేశీ భాషలలో మహా పండితుడు. తెలుగు సాహిత్యం వివిధ ప్రక్రియలలో పి.వి ఆరితేరిన సృజనాత్మక రచయిత, కవి, విమర్శకుడు. కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తెలుగులో రచించిన ‘వేయి పడగలు’ నవలకు పి.వి హిందీ అనువాదం ‘సహస్రఫణ్’ అవార్డులు పొందింది. హరినారాయణ్ ఆప్టే మరాఠి నవలను పి.వి తెలుగులోకి అనువదించారు. వైవిధ్యభరిత భారతీయతకు, భారతీయ సమున్నత, పరమ ఉదాత్త ఆత్మకు ప్రతిబింబం, ప్రతీక పి.వి ఆయన భారత తలమానికం. మహనీయుడు పి.వి అక్షరాల జాతీయవాది, అకళంక దేశభక్తుడు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com