టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ పోరులో టీమిండియా..

- June 29, 2024 , by Maagulf
టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ పోరులో టీమిండియా..

టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫైనల్‌ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, సౌతాఫ్రికా రెడీ అయ్యాయి. ఇంగ్లాండ్‌ను ఓడించిన జోష్‌లో భారత్‌, ఆప్ఘనిస్తాన్‌ను మట్టికరిపించిన పట్టుదలతో దక్షిణాఫ్రికా.. ఎలాగైనా కప్‌ కొట్టి తీరాల్సిందేనని రెండు టీమ్‌లు కసితో ఉన్నాయి. ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో సూపర్‌-8లో ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా జట్లతో మూడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలోనూ గెలిచింది.. గ్రూప్-A పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన రోహిత్ సేన అదే జోష్‌లో ఇంగ్లండ్‌ను సెమిస్‌లో మట్టికరిపించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

టీమిండియా ప్రపంచకప్‌ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్‌ చివరిసారి వన్డే వరల్డ్‌కప్‌ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌ విషయానికొస్తే.. పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా 2007 అరంగేట్రం ఎడిషన్‌లో సాధించింది. ఆతర్వాత 2014లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ గెలిచే అవకాశం వచ్చింది. ఫైనల్‌లో టీమిండియా.. సౌతాఫ్రికాను చిత్తు చేస్తే 13 ఏళ్ల వెయిటింగ్‌కు ఫలితం దక్కనుంది.

ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌ పోరులో టీమిండియా సమిష్టిగా రాణిస్తోంది. భారత్‌ వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన మూడో సీజన్‌ ఇదే. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు 11 మ్యాచుల్లో గెలిచింది. అంతకుముందు నవంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు 12 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచుల్లో గెలిచింది. ఇక దక్షిణాఫ్రికా 8 మ్యాచుల్లో విజయం సాధించి మొదటి స్థానంలో ఉంది. ఫైనల్‌లో ఆ జట్టును భారత్‌ ఓడిస్తే.. రెండు టీమ్‌లు సమంగా నిలవనున్నాయి.

బ్యాటింగ్, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కనిపిస్తోంది భారత్. ఓ వైపు బుమ్రా, అర్షదీప్ నిప్పులు చెరుగుతుండటం టీమ్‌కు కలసి వచ్చే అంశం. స్పిన్నర్లు అక్షర్ పటేల్‌, కుల్దీప్, జడేజా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. ఒక్కో మ్యాచ్‌లో కనీసం ఇద్దరు బౌలర్లు అయినా బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. బ్యాటింగ్ ఫార్మాట్‌లోనూ భారత్ పటిష్టంగా ఉంది. రోహిత్‌ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌ భారత టీమ్‌ను నిలబెడుతోంది. విరాట్‌ కోహ్లి వైఫల్యమే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇక సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా దంచేస్తున్నారు.

సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ టీమ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. 1992లో తొలి వన్డే వరల్డ్‌కప్‌ ఆడిన సఫారీలు.. ఆతర్వాత 8 వన్డే ప్రపంచకప్‌లు, 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడితే ఈసారే ఫైనల్‌కు అర్హత సాధించారు. 33 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌ కప్ క్రికెట్‌ చరిత్రలో లభించిన తొలి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు సఫారీలు. చిరకాల కోరికగా మిగిలిపోయిన వరల్డ్‌కప్‌ విక్టరీ కోసం సౌతాఫ్రికన్ల ఆరాటం అంతా ఇంతా కాదు.

బలాబలాల పరంగా సౌతాఫ్రికా పటిష్టమైన జట్టే అయినా.. క్రికెట్‌ చరిత్రలో ఆ టీమ్‌కు అదృష్టం కలసి రావడం లేదు. ఇనేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన ప్లేయర్లతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ వరల్డ్‌ కప్‌ టైటిల్‌ కూడా గెలవలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన సౌతాఫ్రికా.. తిరుగులేని టీమ్‌గా కొనసాగుతోంది. టాప్‌ టీమ్‌లను ఓడిస్తూ వచ్చింది.

ఇక అంతా అయిపోయింది. ఫైనల్ పోరే మిగిలి ఉంది. ఈ సారి గెలిచి టీ20 వరల్డ్‌ కప్‌ కొట్టిన రికార్డుల్లోకి ఎక్కేందుకు దక్షిణాఫ్రికా.. రెండోసారి టైటిల్‌ విన్నర్‌గా నిలిచేందుకు భారత్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇంగ్లాండ్‌పై విజయం తర్వాత రోహిత్‌ సేనలో మరింత దీమా కనిపిస్తోంది. వరుస విజయాలతో టోర్నీలో కొనసాగుతోన్న దక్షిణాఫ్రికాను టీ20 వరల్డ్ కప్ పట్టుకోవాలనే తపన ఊరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com