రైతు భీష్ముడు-జమీన్ వెంకయ్య

- June 29, 2024 , by Maagulf
రైతు భీష్ముడు-జమీన్ వెంకయ్య

జమీన్ వెంకయ్యగా, కిసాన్ వెంకయ్యగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, రైతు నాయకులు స్వర్గీయ నాగినేని వెంకయ్య ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగంగా ఉన్న అద్దంకి ఫిర్కా లోని ధేనువకొండ గ్రామాన రైతు కుటుంబంలో జన్మించారు.ప్రాథమిక దశలోనే విద్యను ముగించినా తన పరిశీలనా పటిమతో తెలుగు, సంస్కృతం మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

వెంకయ్య చిన్న తనంలోనే దేశ స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న ఆనాటి జాతీయ నాయకుల పట్ల భక్తి భావంతో ఉండేవారు.తన 17వ యేట మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు నందుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.ముఖ్యంగా నాటి ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ లో వెంకటగిరి జమిందారీ సామాన్య రైతులపై ఇష్టారీతిన విధిస్తున్న పన్నులకు వ్యతిరేకంగా నడుస్తున్న జమీన్ రైతు ఉద్యమంలో పాల్గొని నెల్లూరు రామానాయుడు, ఆచార్య ఎన్జీ రంగా, కటికనేని కళ్యాణరావు వంటి ముఖ్య నాయకులతో కలిసి పనిచేశారు. ఒకానొక దశలో  ఉద్యమంలో ఉన్న అగ్ర  నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో జమీన్ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించి వేంకటగిరి జమీందారులకు కంటి మీద కులుకులేకుండా చేశారు. ఈ ఉద్యమమే ఆయన్ని"జమీన్ వెంకయ్య"గా అన్ని ప్రాంతాల రైతాంగానికి దగ్గర చేసింది.    

ధేనువకొండ గ్రామ మునుసుబుగా గ్రామాభిృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు.గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకయ్య అద్దంకి ప్రాంతంలో పార్టీ బలోపేతం తీవ్రంగా కృషి చేశారు. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వచ్చిన కొన్ని సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు కారణంగా తన ఆత్మీయుడు ఆచార్య ఎన్జీరంగా, పాటూరి రాజగోపాల్ నాయుడు, సర్దార్ గౌతు లచ్చన్న మరియు ఇతరత్రా నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కృషికార్ లోక్ పార్టీని స్థాపించారు.

కృషికార్ లోక్ పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎందరో సామాన్య కుటుంబాలకు చెందిన యువకులను, రైతులను  పార్టీలోకి తీసుకువచ్చారు. ఆయన పార్టీ తరుపున నిర్వహించే కిసాన్ మేళా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు, ఈ క్రమంలోనే వారు "కిసాన్ వెంకయ్య"గా గుర్తింపు పొందారు. 1955 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అద్దంకి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కృషి లోకార్ పార్టీ స్వతంత్ర పార్టీలో విలీనం జరిగిన తర్వాత ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాలను చూసుకుంటూ క్రియాశీలక రాజకీయాల నుండి విరమణ పొందారు.

వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.గ్రామ పునరుజ్జీవానికి జనజీవాలు సమకూర్చే కేంద్రస్థానాలు గ్రంథాలయాలని విశ్వసించారు. స్వాతంత్ర పూర్వం ముందే తన స్వగ్రామమైన ధేనువకొండలో సొంత ఖర్చుతో స్వంత స్థలంలోనే గ్రంథాలయం ఏర్పాటు చేశారు.గ్రంథాలయోద్యమ సారథులైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకట రమణయ్య , పాతూరి నాగభూషణం వంటి ముఖ్యులతో ఉద్యమంలో కలిసి పనిచేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ స్థాపనలో సైతం తనవంతు పాత్ర పోషించారు. 1984-88 వరకు ఆ సంస్థ అధ్యక్షులుగా పనిచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. సుమారు 40 సంవత్సరాలు గ్రంథాలయ రంగంలో అవిరళ కృషిచేసారు

వెంకయ్య రైతు పక్షపాతి, స్వతహాగా రైతు కావడం చేత గ్రామీణ ప్రాంత రైతాంగం పడుతున్న సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేసారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతు పోరాటాలను  ముందుండి నడిపించారు. స్వాతంత్ర సమరయోధునిగా తనకు వచ్చే పింఛనుసొమ్ముతో, రైతు సమస్యలపై కరపత్రాలు ముద్రించి పంచారు. ఆయన తుది శ్వాస సైతం గుంటూరులో జరిగిన పొగాకు బోర్డు రైతుల సమావేశంలో విడవటం, అన్నదాతల సమస్యల పరిష్కారంపై ఆయనకున్న అంతులేని ఆపేక్షకు నిదర్శనం.

వెంకయ్య గారికి సాగునీటి రంగంపై ఆసక్తి ఎక్కువ నాటి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు నాటి నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటికోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమని గుర్తించి ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో మేలిమలుపైన ఖోస్లా కమిటీ ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.

గుండ్లకమ్మ నదిపై ఆనకట్ట కట్టాలని తొలిసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్ళింది వెంకయ్యగారే. అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని పంటభూములు బీళ్ళై, ఎడారులుగా తలపించుచున్నవి. వీటికి జలాశయం ద్వారా నీరందిస్తే, అద్దంకి, కొరిశపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు మండలాలను సస్యశ్యామలం చేయవచ్చని మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళినారు. తమ్మవరం వద్ద కొండ - ధేనువకొండకు మధ్య, ఈ వారధి నిర్మించాలని వెంకయ్యగారే ప్రతిపాదించినా ఆయన జీవించి ఉండగా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కల నెరవేరలేదు. కానీ తర్వాత కాలంలో మద్దిపాడు మండలంలోని మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. తన చిరకాల స్వప్నమైన ఆ ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టకపోవడం బాధాకరమైన విషయం.

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ఏనాడు పదవులను కోరుకోలేదు.రైతు పక్షపాతిగా, ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు చిహ్నంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం ప్రజా ప్రయోజనాల కోసమే ఖర్చు చేస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. రాజకీయాలు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే అని భావించిన మహోన్నత వ్యక్తి వెంకయ్య గారు. 


--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com