ఉత్తరాంధ్ర పాడి రైతు బాంధవుడు....!

- July 02, 2024 , by Maagulf
ఉత్తరాంధ్ర పాడి రైతు బాంధవుడు....!

ఆయన రైతుల మేలుకోరిన నాయకుడు.పశువుల పెంపకాన్ని జీవనాధారంగా మార్చిన దార్శనికుడు. విశాఖ డెయిరీ పేరును దేశం నలుమూలలా వ్యాపింపజేసి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన ఉత్తరాంధ్ర పాల పితామహడిగా గుర్తింపు పొందిన ఆయన సుదీర్ఘకాలంపాటు ఆ ప్రాంత ప్రజల పాలిట కల్పవల్లిగా ఉన్న విశాఖ డెయిరీకి చైర్మన్‌గా వ్యవహరించి సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆయనెవరో కాదు ఉత్తరాంధ్ర రైతుబాంధవునిగా, ఆంధ్రా కురియన్ గా ప్రసిద్ధి గాంచిన ఆడారి తులసీరావు.

తులసీరావు మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి గ్రామంలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ (పదో తరగతి) వరకు చదివారు. రైతు కుటుంబం కావడంతో చిన్నతనం నుంచే వ్యవసాయం, పాడి పశువుల పెంపకంపై మక్కువ ఉండేది. దేశానికి అన్నం పెట్టే రైతు బతుకే గొప్పదని మనసా వాచా నమ్మారు. ఎలమంచిలి గ్రామంలో తమ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు కారణంగా 1963లో ఎలమంచిలి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొంది 1986 వరకు 23 ఏళ్ళ పాటు కొనసాగారు. తులసీరావు హయాంలోనే ఎలమంచిలి గ్రామం బాగా అభివృద్ధి చెంది పట్టణంగా మారింది.

 తులసీరావు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్సేతర కీలక నాయకుల్లో ఒకరైన  
రైతు దిగ్గజ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ విల్లూరి వెంకట రమణ అలియాస్ వి.వి.రమణ గారి అడుగుజాడల్లో నడుస్తూ పలు రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. రైతు బాంధవుడు ఆచార్య ఎన్జీ రంగా, గౌతు లచ్చన్న మరియు రమణ గారితో కలిసి పనిచేశారు. సర్పంచ్‌గా ఉంటూనే తన గురువు రమణ గారి నాయకత్వంలో కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీలలో పనిచేశారు.  

1977లో జనతా పార్టీ ఏర్పడ్డ తర్వాత గౌతు లచ్చన్న, రమణ గార్లతో కలిసి ఆ పార్టీలో చేరారు. అనంతర కాలంలో తన గురువైన రమణ  ఆకస్మిక మరణం, జనతా పార్టీ విచ్ఛిన్నం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతున్న సమయంలో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1985 నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబులకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా చక్రం తిప్పారు. వయోభారం వల్ల  అనంతర కాలంలో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సహకార విధానంలో షుగర్ ఫ్యాక్టరీలు, పలు పరిశ్రమల ఏర్పాటులో రమణ గారి పాత్ర కీలకమైంది. రమణ గారి బాటలో నడుస్తూ 1962లో అనకాపల్లి సహకార అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికై సుదీర్ఘ కాలం కొనసాగారు. పాడి పరిశ్రమలో సైతం  సహకార రంగానికి ప్రాధాన్యతనిస్తూ 1973లో ఆంధ్రప్రదేశ్ డెయిరీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో విశాఖ సహకార డెయిరీకి పూనాదులు పడ్డాయి. 1977లో అక్కిరెడ్డి పాలెం వద్ద 20 ఎకరాల్లో డెయిరీ ప్లాంట్ ఏర్పాటు జరిగింది.

విశాఖ సహకార డెయిరీ ప్రారంభంలో 3 నుంచి 4 వేల వేల లీటర్ల పాల సేకరణ జరిగేది. క్రమంగా పాల సేకరణ పెరుగుతూ 1985 నాటికి 30 వేల లీటర్లకు చేరింది. టీడీపీ అధినేత, అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశాల మేరకు 1986లో జరిగిన సహకార డెయిరీ ఎన్నికల్లో విజయం సాధించి విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి తులసీరావు బాధ్యతలు చేపట్టారు.వర్షాధారంపై పంటలను సాగు చేస్తూ, చాలీచాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్న రైతులకు స్థిరమైన ఆదాయాన్ని లభించేలా పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించారు. నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ పాడి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

డెయిరీ తరపున పాడి పశువులను అందజేసి పాల దిగుబడిని, తద్వారా రైతులు ఆదాయాన్ని పెంచడానికి అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య అధ్యక్షుడు ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి సహకారం మరువలేనిది. సహకార డెయిరీల అభివృద్ధి  అందించే నిధులను ఆడారి అభ్యర్థన మేరకు సకాలంలో విడుదల చేయించి డెయిరీ వృద్ధికి తోడ్పాటు నిచ్చారు. భారత క్షీర విప్లవ పితామహుడు పి.జె.కురియన్‌ను ఆదర్శంగా తీసుకుని, విశాఖ డెయిరీని ప్రగతిబాట పట్టించారు.

ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతూ పాల సేకరణను 1990 నాటికి లక్ష లీటర్లకు చేర్చారు. దీంతో పాడి రైతుల్లో తులసీరావు సామర్థ్యంపై నమ్మకం ఏర్పడింది. డెయిరీ ప్రారంభంలో 50 పాల సొసైటీలు మాత్రమే వుండగా వాటిని 1,700 సొసైటీలకు పెంచారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కూడా పాల సేకరణ చేపట్టారు. అనతి కాలంలోనే డెయిరీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం రోజువారీ ఏడు లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతున్నది. పాల సేకరణతోపాటు మార్కెటింగ్‌లో కూడా నూతన ఒరవడిని సృష్టించారు. ప్రస్తుతం 3,700 పాల సేకరణ కేంద్రాల ద్వారా విశాఖ డెయిరీ పాలను సేకరిస్తుంది.  

పాలతోపాలు పెరుగు, మజ్జిగ, నెయ్యి, లస్సీ, పలు రకాల స్వీట్లు, ఐస్‌క్రీములు తదితర ఉప ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. లక్షలాది మంది పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు. విశాఖ డెయిరీ టర్నోవర్‌ను వందల కోట్ల రూపాయలకు చేర్చారు. ప్రస్తుతం విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో రోజుకు 9 లక్షల లీటర్ల  పాల సేకరణ జరుగుతుంది.

డెయిరీకి వచ్చే లాభాలను రైతు కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని తులసీరావు అప్పట్లోనే నిర్ణయించారు. డెయిరీ సభ్య రైతుల పిల్లలను చదువుల్లో ప్రోత్సహించడానికి స్కాలర్‌షిప్‌లు ప్రవేశపెట్టారు. పొలాలకు రహదారులు వేయించారు. కాలువలు, గెడ్డలు, వాగులపై డెయిరీ నిధులతో కాలిబాట వంతెనలు, కల్వర్టులు నిర్మించారు. పాఠశాలలు, కళాశాలలకు భవనాల నిర్మాణం కోసం నిధులు ఇచ్చారు. పలు గ్రామాల్లో ఆలయాలు, కల్యాణ మండపాలు, సామాజిక భవనాలు నిర్మించారు. శ్మశానవాటికలను అభివృద్ధి పరిచారు. డెయిరీ సభ్య రైతులకు, వారి పశువులకు బీమా సదుపాయం కల్పించారు. రైతులకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించడానికి ‘కృషి’ పేరుతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయించారు.

విశాఖ డెయిరీ విజయ ప్రస్థానంలో తులసీరావు కృషికి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆయన ఆధ్వర్యంలో విశాఖ డెయిరీ ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను సాధించింది. 2003లో ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖ డెయిరీకి జాతీయ అవార్డును ప్రకటించింది. అదే ఏడాది వాల్తేరు రోటరీ క్లబ్ 'కార్పొరేట్ సిటిజన్ అవార్డు' ను అందజేసింది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ 2005లో బెంగుళూరులో నిర్వహించిన 34వ జాతీయ సదస్సులో విశాఖ డెయిరీకి ప్రశంసా పత్రాన్ని అందజేసింది.

2007లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విశాఖ డెయిరీ ట్రీట్మెంట్ ప్లాంటును కాలుష్య రహితంగా నిర్వహిస్తున్నందుకు కాంప్లిమెంటు అవార్డును అందచేసింది. పాలు, పాలఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్న ఉత్తమ డెయిరీగా భారత ప్రభుత్వం నుంచి 2009 సెప్టెంబరు 24న 'నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అవార్డు'ను అందుకుంది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ 2010లో బెంగుళూరులో నిర్వహించిన 38వ జాతీయ సదస్సులో విశాఖ డెయిరీకి ప్రశంసా పత్రాన్ని అందజేసింది.

డెయిరీ రంగంలో విశేష పురోగతి సాధిస్తున్న సంస్థగా విశాఖ డెయిరీకి 'ఇండియన్ ఎచీవర్స్ అవార్డు 'ను భారత ప్రభుత్వం, ఇండియన్ ఎకనామిక్ డవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ సంయుక్తంగా అందజేశాయి. విశాఖ డెయిరీకి ఎన్ని అవార్డులు వచ్చినా ఏనాడూ వాటిని అందుకొనేందుకు ఛైర్మన్ ఆడారి తులసీరావు వెళ్ళలేదు. అవార్డుల కన్నా రైతు ప్రశంసలే తనకు మిన్నని ఆయన వినమ్రంగా చెప్పేవారు.  డెయిరీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి తుది శ్వాస వరకు ఆయన చైర్మన్ గా ఎప్పుడూ పనిచేయలేదు. ఒక కార్మికునిగా పాటుపడ్డారు. ఒక పాలరైతుగానే ఆలోచించారు. అందుకే విశాఖ డెయిరీ నేడింతగా ప్రగతి పథంలో దూసుకెళ్తుంది.

 పాడి పరిశ్రమ రంగంలో ఆడారి తులసీరావు గారు సాధించిన అసాధారణ విజయాలు చెబుతున్నాయి, రైతుల పట్ల ఆయనకున్న నిబద్దత. ప్రతి ఇంటిలోను తులసి చెట్టు ఉన్నట్టు... ఉత్తరాంధ్రలోని ప్రతి పల్లెలోను ఆయన ఆనవాలు ఉంటుంది. పాడి రైతుల ఇంట ఆయన పేరు ప్రతిధ్వనిస్తుంది. తెలుగు నాట డెయిరీ రంగంలో ఆయన చేపట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలు కారణంగానే ఆయన్ని "ఆంధ్రా కురియన్" గా పిలుచుకుంటారు. ఉత్తరకోస్తా జిలాల్లో లక్షలాది మంది రైతులు, వినియోగదారుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆడారి తులసీరావు అనారోగ్యం కారణంగా 85 వ యేట కన్నుమూశారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com